Tuesday, April 14, 2026

కృష్ణ నామ రసం - మధురాతి మధురం

మేఘ శ్యాముడు
నవనీత చోరుడు
గోవుల గోపాలుడు
గోపికల గోవిందుడు

గోవర్థన గిరిధరుడు
ముగ్ధ మనోహరుడు
రాధికా హృదయ హరుడు
మా వేణు మాధవుడు

గోకుల నందనుడు
బృందావన బ్రజేంద్రుడు
యశోద చిన్ని కృష్ణుడు
ఛలోక్తుల చిలిపి కృష్ణుడు

అచ్యుతుడు ద్వారకాధీషుడు
మథుర మందగమనుడు
ముద్దులోలికే ముద్దు కృష్ణుడు
జనుల జనార్ధనుడు

మృదు మధుసూదనుడు
అనంత అవతారుడు
చతుర చక్రధరుడు
జగన్మోహన లీలా కృష్ణుడు

సుదాముడి సుదర్శనుడు
కుచేలుని కుబేరుడు
పాండవ సఖుడు
ఇష్టసఖుల ప్రియదర్శనుడు

గోపీ జన వల్లభుడు
భక్త జన లోలుడు
రాసలీలల రసజ్ఞుడు
మన్మథుడికే పితరుడు

పార్థుని సారథుడు
వేద సార విశ్లేషకుడు
భగవద్గీత బోధకుడు
కురుక్షేత్ర మార్గనిర్దేశకుడు

నిందలను మోసినవాడు
అపనిందలను దూరం చేయువాడు
ప్రతిష్టను పెంచెడివాడు
విశ్వరూప దర్శనమిచ్చినవాడు

గొల్లభామల గొల్లవాడు
చిరుమందహాస ముఖుడు
క్లేశ నాశన కేశవుడు
నల్లవాడు మనందరివాడు

వస్త్రాలను తస్కరించినవాడు
వేడుకోగానే, చీరలనిచ్చి ఆదుకొన్నవాడు
బాధలను భరించు హరించు జగన్నాథుడు
ఆపన్నుల ఆపత్కాల ఆపద్బాంధవ అభయంకరుడు

No comments:

Post a Comment