Tuesday, July 28, 2026

సంకల్ప బలం

"మనసులో కచ్చితమైన సంకల్పం ఉంటే గనుక
మార్గం తప్పక ఏర్పడి తీరుతుంది"

కఠినమైన అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా, ఎలాగైనా చేయాలనే బలమైన పట్టుదల, సంకల్ప బలం - లక్ష్యాలను సాధించడానికి మార్గాన్ని సులభం, సుగమం చేస్తుంది.

Friday, July 10, 2026

రాధా - కృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు?

కారణజన్ముడైన అవతార పురుషుడు శ్రీ కృష్ణుడు, తన మామ అయినటువంటి కంసుడిని చంపటానికి, బృందావనాన్ని వీడినప్పుడు, కృష్ణుడి వయసు దాదాపుగా కేవలం 10 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. అప్పుడు రాధ వయసు దాదాపుగా 14 సంవత్సరాల 2 నెలలు.

ఆ రోజుల్లో, అంత చిన్న ప్రాయంలో, ప్రేమ వివాహాలు జరిగేవి కాదేమో కాబోలు? సాధారణంగా ఆ ప్రాయంలో పెద్దలు వివాహం చేస్తుంటారు మరి.

వారి బంధం, వివాహం అనే లాంఛన ప్రాయమైన, ప్రాపంచిక వ్యవస్థను అధిగమించిన శాశ్వతమైన, అలౌకికమైన దైవిక ప్రేమకు ప్రతీక. దైవానికి - భక్తులకు మధ్య అంతిమ కలయికకు, ఐక్యానికి, ఐక్యం కావడానికి ప్రతీక.

భక్తి సంప్రదాయం ప్రకారం, రాధ లాంఛనప్రాయమైన వివాహాన్ని తిరస్కరించింది. రాధ, రాజభవనంలో నివసించడం కంటే గోపాలకురాలిగా స్వేచ్ఛగా కృష్ణుడిని ప్రేమించడానికి ఇష్టపడింది.

రాధా - కృష్ణుల ప్రేమకు, సామాజిక ఆమోదం గానీ, అధికారిక వివాహం గానీ అవసరం లేదు. స్వచ్ఛమైన, షరతులు లేని భక్తి - ప్రేమ అనే మాటలకు అర్థాన్ని ప్రపంచానికి చూపించింది.

రాధా - కృష్ణులు, ఒకే ఆత్మను పంచుకున్న రెండు శరీరాల వంటి వారు. వారి మధ్య వివాహం, ఒక అనవసరమైన ప్రాపంచిక లాంఛనం మాత్రమే.

వేదవ్యాస మహర్షి రచించిన "బ్రహ్మవైవర్త పురాణం" ప్రకారం, మరియు శ్రీ కృష్ణుడి సభలో జ్యోతిష్యుడైన గార్గాచార్య రచించిన "గార్గ సంహిత" ప్రకారం, కృష్ణుడు పెద్దవకముందే, బృందావనంలోని భండీర్వన వనంలో, బ్రహ్మదేవుడు వారికి రహస్యంగా వివాహం జరిపించాడు.

గర్గ సంహిత మరియు బ్రహ్మ వైవర్త పురాణం వంటి గ్రంథాల ప్రకారం, రాధ పరువును కాపాడటానికి, అభిమన్యుడితో ఆమె వివాహం ఒక సాంఘిక లాంఛనం మాత్రముగా జరిగింది. కృష్ణుడే స్వయంగా అభిమన్యుడి రూపంలో వచ్చాడని, అంటే, రాధ అలౌకికంగా ఎల్లప్పుడూ కృష్ణుడితో వివాహ బంధంలోనే ఉందని అర్థం.

శ్రీధాముడు పెట్టిన శాపం కారణంగా రాధ, గోపాలుడైన అభిమన్యుడిని వివాహం చేసుకోగా, కృష్ణుడు రహస్యంగా ఆమె నిజ స్వరూపాన్ని లేక ఆమె నీడను వివాహం చేసుకుంటానని ఆమెను ఓదార్చాడు.

వివాహం తరువాత రాధ, అభిమన్యుడు, అతని తల్లి జటిల, సోదరి కుటిలతో కలిసి నందగ్రామానికి సమీపంలో ఉన్న యవత్ గ్రామంలో నివసిస్తుంది. విరహంలో ఉండే ఈ ప్రణయ ప్రేమ (పరకీయ-రస) గౌడీయ వైష్ణవంలో అత్యున్నతమైన, అత్యంత తీవ్రమైన దివ్య భక్తి రూపం.

శ్రీధామ శాపం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు.

భూలోకంలో శ్రీకృష్ణుడు, రాధల వంద సంవత్సరాల వియోగం గురించి కూడా బ్రహ్మవైవర్త పురాణంలో వివరణ ఉంది.

ఒకసారి, స్వర్గలోకమైన గోలోకంలో, ఒక సరదా వివాదం తలెత్తింది. ఒక అపార్థం కారణంగా పొరబడిన రాధకు కోపం వచ్చి, పొరపాటున భగవంతుని అవమానించింది.

రాధ సన్నిహిత మిత్రుడు మరియు ద్వారపాలకుడైన శ్రీధాముడు, దీనిని అంగీకరించలేదు. కోపంతో రాధ, శ్రీధాముడు మర్త్యలోకంలో అసురుడిగా (రాక్షసుడిగా) జన్మించాలని శపించింది.

దానికి ప్రతిఫలంగా, శ్రీధాముడు రాధను ఒక మర్త్యురాలిగా భూలోకంలోకి అవతరించి, 100 సంవత్సరాల పాటు శ్రీకృష్ణునికి దూరంగా ఉండమని శపించాడు.

అలా, కృష్ణుని గొప్ప భక్తుడైన శ్రీధాముడు మరియు రాధలు, ఒకరికొకరు పరస్పరం శాపాలు ఇచ్చుకున్నారు.

మర్త్యలోకం అంటే,
జీవుల జననం, వ్యాధి, వృద్ధాప్యం, మరణం అనే చక్రానికి లోబడి ఉండే భౌతిక అస్తిత్వ "భూమి లోకం".

వారికి శాపాలు ఉన్నప్పటికీ, కృష్ణుడు వారిద్దరినీ ఓదార్చాడు. శ్రీధాముడు మహా రాక్షసుడైన శంఖచూడుడిగా అవతరించాడు. మర్త్యలోకంలో జరిగిన భీకర యుద్ధం తరువాత, శివుని త్రిశూలం చేత సంహరించబడి, చివరికి గోలోకానికి తిరిగి వెళ్ళగలిగాడు.

ఇంతలో, రాధ భూలోకంలో బర్సానాలో జన్మించింది, అక్కడ ఆమె తన మానవ జీవితమంతా కృష్ణుని విరహ వేదనను అనుభవించింది.

మానవాళికి ఈ 100 సంవత్సరాల ఎడబాటు ఆధ్యాత్మికంగా అవసరమైంది.

శంఖచూడుడు, శ్రీధాముని రాక్షస అవతారం.

వృంద, శ్రీధాముని భూలోక భార్య, తులసి మొక్కగా మారింది.

Monday, July 6, 2026

అభూతకల్పనలు

ఈ రోజుల్లో, ఈ మధ్య, చాలా మంది, కృష్ణుడి పేరు చెప్పి, భగవద్గీత పేరు చెప్పి, ఏమేమో వాగేస్తున్నారు. ముఖ్యంగా motivational speakers, హిందూ వ్యతిరేకులు. వాళ్ల మాటలను కృష్ణుడి మాటలుగా చెప్తున్నారు. అంతా కల్పితం, ఊహాజనితం, వక్రీకరణము. ఎవరికి నచ్చినట్లు వారు అభూతకల్పనలు సృష్టిస్తున్నారు.

భగవద్గీతలో ఎలాగైతే ఉందో, సరిగ్గా అలాగే చెప్తే బాగుంటుంది, దానిని మార్చి చెప్తే అంత బాగోదు.

వాళ్లను ఇలా ఈ క్రింది విధముగా ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం ఇవ్వలేరు.

ఎన్నో అధ్యాయములో ఎన్నో శ్లోకం? శ్లోకం మరియు దాని తాత్పర్యం చెప్తే బాగుంటుంది.

ఎక్కడ ఉంది అలా? ఏ గ్రంథంలో ఉంది? ఏ పురాణంలో, ఏ అధ్యాయంలో, ఏ శ్లోకంలో ఉంది?

రామాయణం అయితే, ఏ కాండంలో ఉంది?
మహాభారతం అయితే, ఏ పర్వంలో ఉంది?
భగవద్గీత అయితే, ఏ అధ్యాయంలో ఉంది?
భాగవతం అయితే, ఏ స్కంధంలో ఉంది?


రామాయణం ఎంతో మంది రాశారు. కానీ, వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికం. ఎందుకంటే, వాల్మీకి శ్రీ రాముడి సమకాలీనుడు కాబట్టి. సీతాదేవికి ఆశ్రయం కల్పించారు. రాముని పరివారముతో ఎంతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి. మొదట రామాయణం రచించినది వాల్మీకియే కాబట్టి.