Friday, February 21, 2025

సగటు మధ్యతరగతి మనిషి జీవన పోరాటం

బాగా డబ్బున్న వారికి, దొంగలు దోచుకుంటారనే భయంతో నిద్ర రాదు. డబ్బు పోతే పోయింది, మరలా సంపాదించుకోవచ్చు అనుకునే ఆత్మవిశ్వాసం ఉన్నవారికి గాఢ నిద్ర వస్తుంది. కటిక పేదరికం అనుభవిస్తున్న పేదలకు, డబ్బును కూడేసుకోవాలి అనే కోరిక ఉండదు. ఈ ఒక్క పూట గడిస్తే చాలు, కడుపులో కాస్త ఎంగిలి పడితే చాలు, ఈ పూటకి కడుపు నిండితే చాలు అనుకుంటారు కాబట్టి, ఒక్క పూట తిన్నా, వారికి నిద్ర బాగానే వస్తుంది. ఎటుపోయి అటూ ఇటూ కానివి, మధ్యతరగతి బతుకులే. చాలీ చాలని జీతాలు, సంపాదనలతో నిత్య పోరాటం చేసేవాడే "సగటు మధ్యతరగతి మనిషి". అటు కోరికలను చంపుకోలేక, ఇటు కోరుకున్నది పొందలేక, గాలిలోనే మేడలు కడుతూ, నీటిలోనే రాతలు రాస్తూ-లెక్కలేస్తూ, మధ్యలో-మీమాంస లోనే నలిగిపోయే, త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడే జీవితాలు - మధ్యతరగతి బతుకులు. మధ్యతరగతి జీవితమే, ఒక సర్దుబాటు, ఒక జీవితకాలపు ఒప్పందం లాంటిది. తెల్లవారుతూనే మొదలవుతుంది ఉరుకులు-పరుగుల, గజిబిజి-గందరగోళ ప్రయాణం. రాత్రికేమో, తెల్లవారగానే అది చేయాలి, ఇది చేయాలి, ఇంకెన్నెన్నో చేయాలి, అనే సంకాల్పాలతోనే గడిచిపోతుంది పవళించే పుణ్య కాలం కాస్తా. ఇక కంటి నిండా నిదుర మాట ఆ దేవుడెరుగు. చిత్రం ఏంటంటే, మధ్యతరగతి మనిషిని చూసి జాలిపడే మనుషులే ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా అరుదు. ఎందుకంటే భూమిపై ఎక్కువగా ఉన్నది వారే కాబట్టి. ఓ మనసున్న మధ్యతరగతి మనిషి, నీ చెమ్మగిల్లిన కళ్లకు, ఒక తాత్కాలిక కంటి తుడుపు కోసమే, నా ఈ వ్యాసం, నీ వర్ణనాతీత - దుఃఖపూరిత కష్టానికి, బాధలకు అంకితం.

Saturday, February 15, 2025

పాప వీక్షణం

మనిషి పాపాలు చేస్తే, భగవంతుడు పై నుంచే కాదు, ఎక్కడి నుంచి అయినా చూస్తాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ వ్యాపి మరి.

తప్పొప్పులు గురించి తెలుసుకోడానికి, పాప-పుణ్యాలు అంటే ఏంటో తెలుసుకోడానికి, భగవద్గీత మరియు వేదాలు చదవాలి.

పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం.

విష్ణు సహస్రనామం ఒక్కసారి చదివితే, వెయ్యి పాపాలు శాంతిస్తాయి.