Tuesday, March 28, 2023

శ్రీ రామనవమి సంధర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

ఉప్పుగూడ రక్షాపురం కాలనీ శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణములో, నెలకొనియున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయములో, శ్రీ రామ నవమి సంధర్బముగా మార్చి 30వ తేదీ 2023 గురువారం రోజు, ఉదయం 5 గంటలకు ప్రదోష పూజలు, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీ రాముల వారికి పంచామృత అభిషేకం మరియు అలంకారము నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి శ్రీ కోదండ రామస్వామి వార్ల కళ్యాణ మహోత్సవము, అనంతరం ఆశీర్వచనములు, తీర్థప్రసాదముల వితరణ, తదుపరి మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమము. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి శ్రీ కోదండరామస్వామి వారికి, పురవీధులలో పల్లకి ఊరేగింపు మహోత్సవము ఘనంగా నిర్వహింప తలపెట్టినట్టు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేసి, రాములోరి ఆశీర్వచనములు పొందగలరని, శ్రీ శివాలయం ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి తెలియచేశారు.

Tuesday, March 21, 2023

ఉప్పుగూడలో తెలుగు కొత్త సంవత్సారానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు

హైదరాబాద్ పాత బస్తి ఉప్పుగూడలో తెలుగు వారు శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఇంటి ద్వారాలకు మామిడాకులతో తోరణాలు కట్టారు. యువతి యువకులు సంప్రదాయబద్ధమైనటువంటి కొత్త బట్టలను ధరించారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలగలసిన షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని గుళ్ళల్లలో దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని రుచి చూసాక ఆహారాన్ని ఆరంగించారు. తెలంగాణా ప్రాంతంలో ఉగాది పచ్చడిని ద్రవ రూపంలో తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పంచాంగ శ్రవణం కోసం ఆలయాలలో తెలుగు ప్రజలు గుమికూడారు. శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకునేందుకు జ్యోతిష్య పండితుల ఇళ్ల ముందు జనాలు బారులు తీరారు. నేటి సాయంత్రం నిర్వహించబోయే కవి సమ్మేళనం గురించి చర్చించుకుంటున్నారు. పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడితో అందరి ఇళ్లు నిండైన తెలుగుదనంతో కళకళలాడుతూ ఉన్నాయి.

Friday, March 17, 2023

దేశానికి మేలు తలపెట్టినట్టా?

గడ్డం పెంచినంత మాత్రాన, ఆ గడ్డం నెరిసినంత మాత్రాన మనిషికి పరిపక్వత వచినట్టా? పాద యాత్ర చేసినంత మాత్రాన ప్రజల కష్టాన్ని తెలుసుకున్నట్టా ? వారి కష్టాలు తీర్చినట్టా? విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తుంటే, దేశానికి మేలు తలపెట్టినట్టా?

Tuesday, March 7, 2023

ఉప్పుగూడలో రంగులతో హోలీ సంబరాలు

హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలో సోమవారం రోజు రాత్రి తానాజీ నగర్ కామ్యునిటీ హాల్ కూడలి వద్ద కామ దహన కార్యక్రమం జరిగింది.

మంగళవారము రోజు ఉదయం నుండి పిల్లలు, యువత రకారకాల రంగులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పిచికారీలతో వివిధ రంగులని ఒకరిపై ఒకరు పిచికారీ చేసుకుంటున్నారు. యువత అనేక రంగులని ఒకరి మొహంపై ఒకరి పూసుకుంటున్నారు, రంగులని బస్తీవాసులపై వెదజల్లుతున్నారు, రంగు నీతిని కుమ్మరిస్తున్నారు. డప్పుల మోతతో హోరెక్కించి, ఆనంద పరవశంతో నృత్యాలు చేస్తున్నారు. రంగులతో నిండిన మొహాలని ఒక్కసారిగా గుర్తుపట్టడం కాసింత కష్టమవుతోంది. తమ రంగులమయమైన మోహాలని అద్దంలో చూసుకొని మురిసిపోయి, నవ్వేసుకుంటున్నారు. ఎటువైపు చూసినా అరుపులు, కేకలు, కేరింతలతో అందరి మోహాల్లో చిరునవ్వులు చిగురిస్తున్నాయి.